కాకమ్మ కబుర్లు

కాకమ్మ కబుర్లు

రమాదేవి జాస్తి
రచనల్లోకి స్వాగతం!

📱

గల్పికలు

ఆనాడు కాకమ్మ తన దాహం తీర్చుకోవడం కోసం కుండలో రాళ్ళు వేస్తే నీళ్ళు పైకి వచ్చాయి. ఈ కాకమ్మ అక్షర మణులు, పద వజ్రాలు, భావగర్భిత వైఢూర్యాలూ వేస్తే.. అనుబంధాల్లోని మాధుర్యం... తేనె పూతలు పూసిన కఠోర సత్యాలు... చుట్టూ ఉన్న వారిలోని ఉదాత్తత, మొత్తంగా మన జీవితాల్లోని సంక్లిష్టతలు - సారళ్యాలూ - సౌందర్యాలూ ఉబికి వస్తాయి. ఇక మన సాహితీ దాహం తీర్చుకోవడమూ... ఆస్వాదించడమే తరువాయి.

ఓ హెచ్చరిక: కొన్నింటికి నవ్వీ నవ్వీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి... కొన్ని రచనలకు జ్ఞాపకాలు చుట్టుముట్టి, గుండెలు బరువెక్కి కన్నీళ్ళొస్తాయి. అందుకు సిద్ధపడి మొదలుపెట్టండి.

గల్పికలు
📄

కథలు

Collection of PDF documents, literary works, and downloadable resources for our readers.

కథలు
ℹ️

కవితలు

Learn more about Kakamma Kaburlu and our mission to bring quality content to our community.

కవితలు

కాకమ్మ స్వగతం…

పుట్టుక, బాల్యమూ...

అబ్బ! అవి ఏనాటి ముచ్చట్లో కదా?! మరి నాకిప్పుడు ఆరేళ్లాయె. (6x11)!!

పుట్టింది కృష్ణా జిల్లా ఉయ్యూరులో. సరిగ్గా స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి. అమ్మ సరోజనీదేవిది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర పెదమద్దాలి. నాన్న జాస్తి కృష్ణమూర్తి గారిదేమో తెనాలి దగ్గర పెదపూడి. ఆయన జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు.

నాన్నగారికి తరచూ బదిలీల పుణ్యామాని బాల్యమంతా చింతపల్లిపాడు, పూనూరు, రావినూతల వగైరా పల్లెటూర్లలో గడిచింది. ఆ చింతతోపులు, కంది, జొన్న, మిరప చేలూ, గట్ల మీద కాపలా సైనికుల్లా బంతిపూల మొక్కలూ, వర్షాకాలంలో కాళ్లకి తగిలించుకొచ్చే బురద బూట్లూ, ఇంకా గుండెని తడితడిగా, పచ్చపచ్చగా పలకరించే జ్ఞాపకాలే! అలా ఆడుతూ పాడుతూ అలవోకగా హైస్కూలు చదువు పూర్తయింది. అప్పటికే పిల్లల కథల పుస్తకాలు చదవడం అలవాటు కావడంతో బుర్రనిండా కథలకి సంబంధించిన ఆలోచనలు సుడులు తిరుగుతుండేవి.

పై చదువు సంధ్యలు

ఇంటర్‌ నుంచి ఎం.కామ్‌. వరకూ పూర్తి చదివింది గుంటూరులోనే. పుస్తకాల్లో జీవితాన్ని చదవడం ఆరంభమైంది కూడా అక్కడే. నాన్నగారు పాఠశాల గ్రంథాలయం నుంచి బోలెడు పుస్తకాలు తెచ్చిచ్చేవారు. చిత్రమేమిటంటే ఆయనకు చదివే అలవాటే లేదు. తీరికవేళల్లో అమ్మ మాత్రం చదివేది. తొమ్మిది  పదులకి దగ్గరవుతున్నా ఇప్పటికీ చదువుతుంది.

అట్లా ఎంతోమంది మహామహుల రచనలు ఆనాడే చదివేను. అందువల్లనే మంచి భాషాసంస్కారాన్నీ, భావజాలాన్నీ కూడా అలవరచుకోగలిగేననుకుంటాను. చేతిలో పుస్తకం ఉంటే అది పూర్తయ్యేదాకా చుట్టూ ప్రపంచం ఏమైపోయినా పట్టదు నాకు. ఇప్పటికీ, ఎప్పటికీ చదువుకోవడమే నాకిష్టం. అందుకే ‘రాత’ జోలికి ఎక్కువగా పోను. ఇరవై రెండేళ్ల వయసులో ‘చలం’గారి పుస్తకాలు చదివినప్పుడు నన్ను గురించి నాకెంతో అర్థమైంది. నా అశాంతికి మూలాల్ని వెతుక్కో గలిగాను. నాకళ్లు కొత్త ప్రపంచంలోకి తెరచుకున్నాయి. స్త్రీ పట్ల, పిల్లల పట్ల ఆయన రచనల్లో తొణికిసలాడే ప్రేమ, దయ, కరుణ అపూర్వం, అపురూపం. ఇప్పటికీ ఆయనంటే దైవమే నాకు.

రాతకోతలు

నా మొట్టమొదటి కథ ‘సంకెళ్లు’ - 1972 జులై ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో వచ్చింది. అసలు కథలు ఎలా పంపాలో కూడా తెలీనితనం. ఎలా పంపాలో గురువుగారు ‘నాగభైరవ కోటేశ్వరరావు’గారు చెప్పారు నాన్నగారికి.

కథ అచ్చయినా పుస్తకాలు దాచుకోని అమాయకత్వం. ఏదో అలాగే అప్పుడోటీ, ఇప్పుడోటీ తప్ప అతిగా రాయాలనుకోలేదు. అదృష్టవశాత్తూ రాతనేది నాకు ‘వ్యసనం’గా మారలేదు. అప్పట్లో కొన్ని పత్రికలు కథలు అచ్చువేసేవి కాని, పారితోషికాలు సంగతి దేవుడెరుగు, కనీసం ముందుగా తెలియజేయడమో లేదా ఓ ప్రతి పంపడమో కూడా చేసేవి కాదు. ఎవరైనా ‘నీ కథ ఫలానా పుస్తకంలో వచ్చింది’ అని, చెబితే  గానీ తెలిసేది కాదు !

ఆ రోజుల్లోనూ రెండు సార్లు బహుమతులొచ్చాయి. ‘పురాణం సుబ్రహ్మణ్యశర్మ’గారు బాగానే ప్రోత్సహించారు. కథల్ని ఎక్కువగా అచ్చువేసి, 79లో వర్ధమాన రచయిత్రిగా ‘ఆంధ్రజ్యోతి’లో పరిచయం చేసి. అయినా అదో ఘనతనే అభిప్రాయమూ కలగలా! ఇంతలో జీవనోపాధి కోసం ఉద్యోగాల వేటలో నాకథారంగం రాజధాని నగరానికి మారింది.

కుదుటపడిన జీవితం

హమ్మయ్య! ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత అక్కడే ‘స్వామి’ లాంటి జీవిత భాగస్వామి దొరికేరు. అప్పటికే అదో కథకుల నిలయం. ఎమ్మెస్సార్‌ మూర్తి, పరుచూరి వెంకటేశ్వరరావుగారు (అప్పటికింకా పూర్తిగా సినిమా వాళ్లై పోలా), డి.ప్రభాకర్, శంకరమంచి, పమ్మి, పాలకోడేటి... ఇలా ఎంతోమంది హేమాహేమీలు, ‘రంజని’ అనే సాహితీ సంస్థ, లైబ్రరీ నిండా బోలెడు పుస్తకాలు, ఆ గాలీ, ఆ నేలా మహిమ కాబోలు - మళ్లీ రాయాలనిపించింది. 1994లో ‘పెద్దలను గౌరవించవలెను’ కథ రాసి ‘స్వాతి’ వారపత్రికకు పంపాను. దానికి రూ.మూడు వేలు మొదటి బహుమతి వచ్చింది. ఆ ఉత్సాహంలో మళ్లీ కొన్ని రాసేను. 1997లో ఆంధ్రభూమి కథల పోటీలో ‘రహదారి’ కథకు రూ.5 వేలు బహుమతి వచ్చింది. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు కాబట్టి, వందల్లో ఉత్తరాలొచ్చేవి కథల్ని అభినందిస్తూ, - బద్ధకంగా వాళ్లకు జవాబులు రాస్తుండే దాన్ని. ఆ రెండున్నర సంవత్సరాల కాలం కథలు, ఉత్తరాలతో కోలాహలంగా,సంతోషంగా గడిచింది. ‘‘అమ్మాయీ, నువ్వు నాకు వెంటవెంట ఉత్తరాలు రాయకపోతే కాశీలో గోవుని చంపినంతపాపం’’ అని గురువు గారు నాగభైరవ కోటేశ్వరరావుగారు అప్పట్లో ఆత్మీయంగా బెదిరిస్తూ రాసిన ఉత్తరం మొన్నీ మధ్య మళ్లీ కంటబడి కన్నీరు తెప్పించింది. ఆయన నా కథల్ని, ఉత్తరాల్ని కూడా బాగా ఇష్టపడేవారు. నేనిప్పుడు బద్ధకం కాస్త వదుల్చుకున్నాను. కానీ ఉత్తరాలు రాద్దామంటే ఆయన లేరు మరి.

ఆ తర్వాత ఏమైందో మళ్లీ రాయడం మానేశాను. ఇంట్లోనూ, ఉద్యోగంలోనూ విపరీతమైన పని ఒత్తిడి. కుటుంబ బాధ్యతల్లో ఊపిరి సలపలేదు. నలుగురు పిల్లలు ఉన్నారు మరి! (అప్పటికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరబ్బాయిల పెళ్లి బాధ్యత, మూడేళ్ల ఉద్యోగ బాధ్యత ఇంకా మిగిలున్నాయి). కొంచెం సమయం దొరికితే చదువుకోడానికే సరిపోయేది కాదు. మధ్యలో ఒకట్రెండు సార్లు తప్ప 2010 వరకూ మళ్లీ కలం పట్టలేదు.

అక్టోబరు 2010లో ‘చతుర’లో ‘కళాభిమాని’ హాస్యకథతో ముచ్చటగా మూడోసారి - మళ్లీ రాయడానికి శ్రీకారం చుట్టాను. ‘స్వాతి’లో హాస్యకథల పోటీలోనూ, ‘నవ్య’ వారపత్రికలో రెండుసార్లు బహుమతులొచ్చాయి. ఇటీవలే స్వాతి ‘కథ కథ కథ’ పోటీలో ‘నిన్ను నిన్నుగా ప్రేమించే’ అనే అంశం మీద రాసిన ‘అతని భార్య’ రూ.9999 బహుమతి వచ్చింది. ఇలా బహుమతులొచ్చినప్పుడు - ఫర్లేదు, బాగానే రాస్తున్నానన్నమాట! అని కొంచెం సంతోషంగా ఉంటుంది, అప్పుడప్పుడూ రాస్తూండవచ్చని ధైర్యంగానూ ఉంటుంది.

మరపు రాని గుర్తింపు

‘ఒరులేయవి యొనరించిన’ కథ మొదట ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో వచ్చి, ‘దేవినేని మధుసూదనరావు’ దంపతుల దృష్టిలో పడి, వారి ‘మనసున మనసై’ పుస్తకంలో చోటు చేసుకుంది. ఆ విధంగా ‘కాకతీయ చిరంజీవి’ గారి హృదయంలోనూ, తద్వారా వారు ప్రచురించిన పుస్తకంలోనూ స్థానం సంపాదించగలిగింది. తెలుగువెలుగు తొలిసంచికలోను, ఆ తరువాతా కొన్ని కథలు చోటు దక్కించుకున్నాయి.
‘రచన’ మంచి అభిరుచి, స్పందించే హృదయం ఉన్న పెద్దల ఆత్మీయతని, ఆశీస్సులని నాకు వరంగా ఇచ్చింది. ఇంతకన్నా సార్థకత ఏం కావాలి. నేనూ ధన్యు రాలినే!

నాది ఇల్లు, వుద్యోగం, కుటుంబం ఇలా చాలా చిన్న ప్రపంచం. అందులో నుంచే నేను నా కథల్లో మానవ సంబంధాల్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. స్వతహాగా నాకు వ్యంగ్యంతో కూడిన హాస్యమంటే చాలా ఇష్టం. అందుకే హాస్య కథలు కూడా రాశాను. అవీ మంచి ప్రశంసలనే అందించాయి. గంభీరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. కానీ పట్టుమని పది నిమిషాలు కూడా నా వల్ల కాదు.

గుంటూరమ్మాయిని కాబట్టి కారం లేని కూరలు, సారం లేని కథలంటే అసహనం నాకు. మంచి కథలన్నా, మంచినీళ్ల ప్రాయంగా రాసేయగల రచయిత/త్రులన్నా - గొప్ప ఆరాధన!

ముక్తాయింపు

నలభయ్యేళ్ల క్రితమే మొదటి కథ అచ్చయినా, ఇప్పటి వరకూ రాసిన కథల సంఖ్య నాలుగు పాతికలకి మించకపోవడం నా బలమూ, బలహీనత కూడా! ఏదో గుట్టుగా తెరచాటునే ఉండి అప్పుడొకటి, ఇప్పుడొకటి రాసుకునేదాన్ని. తర్వాత పెద్ద కథలు రాసే ఓపిక తగ్గిపోవడాన ఫేస్‌బుక్‌లో అడపాదడపా చిన్న కథల తరహాలో గల్పికలు రాస్తున్నాను. ఇప్పుడిల్లా ఆ ఫేస్ బుక్‌ వల్లన, యూట్యూబ్ లో లక్ష్మి గారి వల్లన నలుగురికీ పరిచయం అవ్వటం నేను ఎన్నడూ ఎదురుచూడని, ఆశించని అనుభవాలు.

కృతజ్ఞతలతో
రమాదేవి జాస్తి